హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య కాంప్లిమెంటరీ టిక్కెట్ల (ఉచిత పాస్‌లు) వివాదం రోజురోజుకు ముదురుతోంది. హెచ్‌సీఏ బ్లాక్ మెయిలింగ్ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆదివారం కోరింది. వెంటనే ఈ వివాదంను పరిష్కారించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మరి ఈ వివాదం ఎక్కడివరకు దారితీస్తుందో చూడాలి.
కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ బెదిరింపులు ఇలానే కొనసాగితే.. మరో రాష్ట్రాన్ని హోమ్ గ్రౌండ్‌గా మార్చుకుని ఐపీఎల్ మ్యాచ్‌లు అక్కడ నిర్వహించుకుంటామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐకి రాసిన మెయిల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేర్కొంది. హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కలిసి కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపింది. హెచ్‌సీఏతో కలిసి 12 ఏళ్లుగా పనిచేస్తున్నామని, అయితే ఈ రెండేళ్లలో వేధింపులు ఎక్కువయ్యాయని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం పేర్కొంది. విషయం తెలిసిన హైదరాబాద్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదం త్వరగా ముగియాలని, ఎస్‌ఆర్‌హెచ్ ఎక్కడికీ వెళ్లొద్దని కోరుకుంటున్నారు.