HCA IPL Tickets Scam:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఐపీఎల్ టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఐపీఎల్ టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని తెలుస్తుండటంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, CEO సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read Also:Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్!
ఈ దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలబడనున్నాయి. ప్రత్యేకంగా SRH (సన్రైజర్స్ హైదరాబాద్) ఫ్రాంచైజీపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఐపీఎల్ మ్యాచ్ లకు ఇప్పటికే కేటాయించిన 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లతోపాటు, అదనంగా HCA మరికొన్ని టికెట్లు ఇవ్వాలంటూ SRH ను బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ టికెట్లు ఇవ్వకపోతే మ్యాచ్ జరగనివ్వమని బెదిరించినట్టు SRH ఆరోపించింది.
మార్చి 27న హైదరాబాద్, లక్నో మ్యాచ్ సందర్భంగా.. HCA యాజమాన్యం VIP బాక్స్ లకు తాళాలు వేసిన ఘటన కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని SRH బీసీసీఐకి లేఖ రాసింది. అంతేకాదు ఏకంగా, గ్రౌండ్ మార్చాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ టికెట్ల వివాదంపై విజిలెన్స్ శాఖకు దర్యాప్తు ఆదేశించింది.
Read Also:KCR Health Update: నేడు మరోసారి యశోదా హాస్పిటల్కు వెళ్లనున్న మాజీ సీఎం..!
దీనితో విజిలెన్స్ శాఖ నిర్వహించిన విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాంప్లిమెంటరీ టికెట్ల పంపిణీలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని, HCA బ్యాంక్ ఖాతాల నుంచి అనధికారికంగా నిధులు బదిలీ చేసినట్లు, అలాగే కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ మరింత లోతుగా విచారణను కొనసాగిస్తోంది. మొత్తానికి, HCA టికెట్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి. విచారణ తుది దశకు చేరుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పేర్లు బయటపడే అవకాశం కనిపిస్తోంది.