వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. “రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ మూసీ ప్రక్షాళన లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పదేపదే పాలమూరు బిడ్డను అంటూ, శుష్కమైన సెంటిమెంట్ ను వల్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదు. నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు, రేవంత్ కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం? బంగారం పండే నల్లరేగడి భూములు ఉన్న పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణం. తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణాజిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం.” అని హరీష్‌రావు పేర్కొన్నారు.
READ MORE: CM Revanth Reddy: ఆ ప్రమాదంలో 9 ఏళ్లు ఐనా మృతదేహాలు దొరకలేదు..
ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు వేసి ఆలస్యమయ్యేటట్టు చేసింది మీ కాంగ్రెస్ నాయకులు కాదా? అని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. “మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతిక పరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యు కుహరంలోకి నెట్టారు. వారి ప్రాణాలు బలితీసుకొని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారు. నీకు నిజాయితీ ఉంటే ఎస్ ఎల్ బి సి ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు! దోషులు ఎవరో తేల్చు! పచ్చి అబద్ధాలు, పిచ్చి సెంటిమెంట్లు నోటికి వచ్చినట్టు కారు పూతలు బంద్ చెయ్. ఒర్రితే పనులు కావు ఒళ్ళు వంచి పని చేస్తే పనులవుతాయి. 15 నెలలు అయినా నీకు జ్ఞానోదయం కాకపోవడం తెలంగాణ దౌర్భాగ్యం. నిధులు ఖర్చు చేయకుండానే 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు అయ్యాయా? మీ హయాంలో డిండి ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అది అసలు నిజం. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పనులు ఆగలేదు కనుకే రేవంత్ రెడ్డి అపుడు ఏం మాట్లాడలేదు. కేసీఆర్ అంటే పచ్చని పంటలు, రేవంత్ రెడ్డి అంటే పచ్చి అబద్దాలు అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్చగా రోజుకు 10వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నరు. ఇదేందని మేము ప్రశ్నిస్తే అడ్డుకోవాల్సింది పోయి, మా మీద రంకెలు వేస్తున్నరు. నీకు చాతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. బీజేపీతో పగలు కుస్తీ రాత్రి దోస్తీ. ఎస్ ఎల్ బి సి ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన బిఆర్ఎస్ నాయకులను ఆపారు ఎందుకు? బిజెపికి స్వాగతం పలికారు ఎందుకు? ఇప్పటివరకు ప్రమాదం పై పల్లెత్తు మాట మాట్లాడలేదు బీజేపీ. ఎస్ ఎల్ బి సి ప్రమాదంపై ఎన్డీఎస్ ఎ స్పందించదు, చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై సిబిఐ, ఈడి, ఐటీ విచారించవు. ఒకరు కొట్టినట్టు, మరొకరు ఏడ్చినట్టు చేసే డ్రామాలు బంద్ చేయండి. ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకండి.” అని బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.