Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు జ్యూడిషియల్ వ్యవహారాలపై మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పినా, సీఎం సభలో కోర్టును ధిక్కరించి మాట్లాడారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో ఎలాంటి పరిణామాలు జరగలేదని, ఇప్పుడు కూడా ఏమీ కాదని సీఎం సభలో వ్యాఖ్యానించారని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ కాదని చెప్పడం ద్వారా సీఎం తన పరిధిని దాటి సుప్రీంకోర్టు పై మాట్లాడారని ఆయన విమర్శించారు. రూల్ బుక్ చదివి వినిపించినా సీఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని హరీష్ రావు ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతుందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. “నిన్న ఒక్కరోజే రెండు హత్యలు, రెండు అత్యాచార ఘటనలు జరిగాయి” అని వివరించారు. మేము ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగ్గా నిర్వహణలో లేకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఫ్యూచర్ సిటీకి ఇప్పటికే నాలుగు రోడ్లు ఉన్నాయని, ఐదో రోడ్డు అవసరమేంటని ప్రశ్నించారు. “మీ అత్తగారి భూములు ఉన్నాయని ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పది లైన్ల రోడ్లు వేస్తున్నారు” అని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబ ప్రయోజనాల కోసం ప్రజా ధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. “మీ అత్తగారి భూముల కోసం ఐదు వేల కోట్లు పెట్టడం కంటే మీ సొంత డబ్బులతో వేసుకోవచ్చు” అని ఎద్దేవా చేశారు.
భూముల అమ్మకాన్ని గతంలో వ్యతిరేకించిన ప్రభుత్వం ఇప్పుడు ఐఎంజి భూములను అమ్మేందుకు సిద్ధమవుతోందని హరీష్ రావు విమర్శించారు. భూముల విషయంలో తాము చెప్పినదానికి మరియు ఇప్పుడు చేస్తున్నదానికి భారీ వ్యత్యాసం ఉందన్నారు. ఉప ఎన్నికల అంశంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో అర్థమవుతోందని హరీష్ రావు అన్నారు. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి రావచ్చన్న అనుమానం ముఖ్యమంత్రికి ఉండొచ్చని, అందుకే ఉప ఎన్నికలు రావని చెబుతున్నారని ఆయన ఆరోపించారు.
Budget Cars: సరికొత్త ఫీచర్లతో బడ్జెట్ ధరలలో లభించే కార్లు ఇవే..