మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో నూతన మెడికల్ కాలేజ్‌కు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మళ్లీ పెద్ద మెజార్టీతో గెలవబోతున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 180 కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకు శంకుస్థాపన చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, 300 కోట్లతో 450 పడకల ఆసుపత్రి కూడా రాబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. మహేశ్వరం నియోజకవర్గానికి కేసీఆర్ గారు ఇచ్చిన బహుమతి కందుకూరు ప్రజలకు వరమని, ఇక్కడ నుండి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు పోయే పరిస్థితి ఇకపై ఉండదన్నారు.
అంతేకాకుండా.. జ్వరం నుంచి మొదలుకొని కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ చికిత్స వరకు అన్ని రకాల వైద్యం ఇక్కడే అందుబాటులోకి రాబోతున్నాయని, 157 మెడికల్ కాలేజీలు దేశంలో కేంద్రం సాంక్షన్ చేస్తే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకి ఇవ్వలేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నారని, 60 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పరిపాలనలో రెండే రెండు మెడికల్ కాలేజీలు తెలంగాణ ప్రాంతానికి వచ్చాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
కేసీఆర్ సీఎం అయిన తొమ్మిదేళ్ళల్లో 23 మెడికల్ కాలేజీలు వచ్చాయని, 2800 ఉన్న ఎంబీబీఎస్ సీట్లను 10,000 ఎంబీబీఎస్ సీట్లకు పెంచుకున్నామని, తెలంగాణ వైట్ కోట్ రెవల్యూషన్ లో బిజెపి సహకరించలేదు కానీ ఈ దేశాన్ని ముంచిన వైట్ కాలర్ నేరస్తులను మాత్రం దేశం దాటించిందని ఆయన అన్నారు. అభివృద్ధి కి తెలంగాణను కేరాఫ్ అడ్రెస్ గా మార్చింది కేసీఆర్ అని, విపక్షాల మాటలకు విలువలేదు కెసిఆర్ కి తిరుగు లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాత్రికి దొంగ కరెంటు, ఉత్త కరెంటు ఉండేది. కాని కేసీఆర్ 24 గంటల నాణ్యమైన కరెంటు రైతులకు ఇస్తున్నారని, కాంగ్రెసోళ్లు మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలంటున్నారు.
రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ రైతులకు మూడు గంటలే కరెంట్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణను కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 3 గంటల కరెంట్ ఇస్తం అన్న కాంగ్రేస్ కావాలా మూడు పంటలకు కడుపు నిండా కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా అని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష ఓట్ల మెజార్టీతో సబితా ఇంద్రారెడ్డి గెల్పించాలని ఆయన కోరారు.