Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. ఈరోజు (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హరీష్ రావు హాజరు కావాలని తెలిపింది. ఈ విచారణ కోసం సిట్ అధికారులు ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగా కేసు ముందుకు సాగనుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఈ కేసులోని ప్రధాన ఆరోపణ.
Read Also: Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నేడు నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం
కాగా, కాసేపట్లో తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు హరీష్ రావు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఉదయం 9గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. హరీష్ రావుకు మద్దతుగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు తెలంగాణ భవన్ కి రావాలని ఇప్పటికే బీఆర్ఎస్ సమాచారం ఇచ్చింది. ఇక, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీష్ రావును వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. తెలంగాణ భనవ్ నుంచి సిట్ విచారణకు హరీష్ రావు వెళ్లనున్నారు.
