Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పార్లమెంటరీ వ్యవస్థకు వ్యతిరేకమని, కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో ప్రస్తావించకూడదని స్పష్టంగా “కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్” పేర్కొంటుందన్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ కొనసాగుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే తీర్పు ఇచ్చినట్లుగా వ్యవహరించారని హరీశ్ రావు విమర్శించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావని, ఉప ఎన్నికలు రానివని సీఎం స్పష్టం చేయడం, ఆయన హోదాకు అతీతంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. తన పరిధిని మించి మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద మాట్లాడేందుకు తాను ప్రయత్నిస్తే, తన మైక్ కట్ చేయడం ప్రభుత్వం వైఖరికి నిదర్శనమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సలహాలు తీసుకోవచ్చని చెబుతూనే, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం విచిత్రమన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసినట్లు ప్రకటించారు.
అలాగే, రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ నిషేధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బీఆర్ఎస్ హయాంలో వీటిపై చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రస్తుత పాలకులు కనీస నియంత్రణ కూడా పాటించలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ఆరు గంటలకు ఒక హత్య జరుగుతోందని, లా అండ్ ఆర్డర్ పతనం కావడంలో సీఎం పూర్తి వైఫల్యం వహించారని విమర్శించారు. పోలీస్ శాఖ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం, గతేడాదితో పోల్చితే 23% నేరాలు పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులో రెండు అత్యాచార ఘటనలు, రెండు హత్యలు జరగడం ప్రభుత్వ నిస్పృహకు అద్దం పడుతోందన్నారు. నగరంలో 50% సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, పోలీసులకు ఆధునిక వాహనాలు ఉండవచ్చేమోగాని, వాటికి డీజిల్ కూడా నింపే స్థితి లేదని ఎద్దేవా చేశారు.
అంతేకాక, పోలీస్ చరిత్రలోనే అధికారంలో ఉన్న సీఎం పోలీస్ కుటుంబాలను అరెస్ట్ చేయించడం ఇదే మొదటిసారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమనగల్ ప్రాంతంలో సీఎం కోసం మరో రహదారి నిర్మాణం ఎందుకు అవసరమని ప్రశ్నించారు. ఇప్పటికే నాలుగు రోడ్లు, రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్లు ఉండగా, 5,000 కోట్ల రూపాయల వ్యయంతో 10 లైన్ల రహదారి ఎందుకు నిర్మిస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వ సమర్థత లేనందున రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయబోతుందని హెచ్చరించారు.
ప్రతిపక్ష సభ్యులకు అసెంబ్లీ బడ్జెట్‌లో భాగస్వామ్యం కల్పించకుండా, తమ అభ్యర్థనలను పూర్తిగా పక్కనపెట్టడం అన్యాయమని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూముల అమ్మకాలపై మండిపడిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా భూముల అమ్మకాన్ని సమర్థించడం విపరీతమైన రెండు ముఖాలు చూపే రాజకీయమని విమర్శించారు. ప్రత్యేకంగా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు తీర్పును ఆసరాగా తీసుకుని భూములను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని అన్నారు.
సమాంతరంగా, రాష్ట్ర పాలనలో ముఖ్యమంత్రి విఫలమైన తీరు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని హరీశ్ రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు నమ్మకంగా పని చేసిన పార్టీ ఎవరో ప్రజలు త్వరలోనే తేల్చి చెబుతారని, తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా నిలిపామని గుర్తు చేశారు. కాంగ్రెస్ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ కిషోర్