పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో మొదటి భాగం రిలీజ్ కానుంది. జులై 24న ప్రపంచవ్యాప్తంగా హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ కాగా.. వీరమల్లు కథ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
హరి హర వీరమల్లు సినిమా తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ నిజ జీవితంలోని ఏ నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా రూపొందించబడిందట. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరమల్లు కథ పూర్తిగా మారిపోయింది. కథలోని స్ఫూర్తి, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా దీనిని మలిచారు.
Also Read: Vem Narender Reddy: రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోంది!
పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో.. ‘హరి హర వీరమల్లు’ను శివుడు మరియు విష్ణువుల అవతారంగా మనం చూడబోతున్నాం అని తెలుస్తోంది. మనం సరిగ్గా గమనిస్తే.. హరి (విష్ణు) హర (శివుడు) అనే టైటిల్ సినిమా సారాంశాన్ని ఇట్టే తెలియజేస్తుంది. శివుడు, విష్ణువుల అవతారం ‘వీరమల్లు’ అని చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను చిత్రంలో ఉపయోగించారు. అంతేకాదు కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకంను పట్టుకుని ఉంటారు. సినిమాలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల రూపంగా కనిపిస్తారు.