Hajj Yatra: హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న మస్జిద్ అల్-హరామ్ (పవిత్ర మసీదు) ప్రాంతంలో జరగుతుంది. హజ్ యాత్ర ఇస్లాం మతంలోని కీలక అంశం. అంటే ఒక ముస్లిం ఆర్థికంగా, శారీరకంగా స్తోమత ఉన్నంతలో తన జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర చేయాలి. ఇక హజ్ ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12వ నెల ధుల్ హిజ్జా లో నిర్వహించబడుతుంది. ధుల్ హిజ్జా 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ పవిత్ర యాత్రలో లక్షలాది ముస్లింలు పాల్గొంటారు. హజ్ లో భాగంగా ముస్లింలు ‘కాబా’ చుట్టూ తవాఫ్ చేయడం, సఫా-మర్వా కొండల మధ్య నడవడం, మినా, అరాఫాత్, ముజ్దలిఫాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం వంటి ఆత్యాద్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
2025లో హజ్ యాత్ర, చంద్రుని దర్శనాన్ని ఆధారంగా చేసుకుని, జూన్ 4 నుండి జూన్ 9 మధ్యలో జరగనుందని అంచనా. కాగా, హజ్ తేది ఖచ్చితంగా చంద్రుని తొలినాటి దర్శనంపై ఆధారపడి నిర్ణయించబడుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని చక్రాన్ని అనుసరిస్తుంది, అందువల్ల ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ (సాధారణ క్యాలెండర్)తో పోలిస్తే ప్రతి సంవత్సరం 11–12 రోజులు ముందుకు వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం హజ్ తేది మారుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్ర జూన్ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. సౌదీ హజ్ మంత్రి తౌఫిక్ అల్-రబియా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇప్పటికే విశ్వవ్యాప్తంగా నుండి ఒక మిలియనుకు పైగా యాత్రికులు సౌదీకి చేరుకున్నట్లు తెలిపారు. గత ఏడాది మొత్తం 1.8 మిలియన్ ముస్లింలు హజ్ యాత్రలో పాల్గొన్నారని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి.
Read Also: US Visa: విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశం.. ఆ కారణంతోనే..
ఈ హజ్ యాత్రలో నాలుగు రోజుల పాటు పవిత్ర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రెండో రోజు మౌంట్ అరాఫాత్ పర్వతంపై ముస్లింలు భారీగా ఒకేచోట చేరి ప్రార్థనలు నిర్వహించటం ముఖ్య ఘట్టం. ఈ పర్వతం వద్దే ప్రవక్త మహమ్మద్ చివరి ప్రవచనం ఇచ్చినట్టు విశ్వాసం ఉంది. ఈ సంవత్సరం అరాఫాత్ దినోత్సవం జూన్ 5న జరుగుతుందని, అనంతరం ఈద్ అల్-అధా పండుగ జూన్ 6న జరగనుందని సౌదీ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.