Hair fall: వానకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం. ఈ కాలాన్ని వెంట్రుకలకు ఒక విధంగా శత్రువు లాంటిదని చెప్పుకోవచ్చు.వాతావరణం తడిగా ఉండటంతో చుట్టు పక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చుండ్రు వస్తుంది. దాంతో పాటు జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా వెంట్రుకలు పొడిబారిపోతాయి కూడా. తల కూడా దురదగా అనిపించవచ్చు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు: వారానికి కనీసం మూడుసార్లు తలస్నానం చేయండి. అంటే రోజు మార్చి రోజు తలస్నానం చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా తలలో పేరుకుపోయిన వ్యర్థాలు పోతాయి. వర్షాకాలం కాబట్టి వర్షంలో తడవకపోవడం మంచిది. ఎందుకంటే వాన నీటిలో అనేక రకాలైన కాలుష్యాలు కరిగిపోయి ఉంటాయి. ఇవి జుట్టుకు విపరీతమైన హానిని కలిగిస్తాయి. జుట్టును ఆరబెట్టుకోవడం కోసం హెయిర్ డ్రయర్ వాడకపోవడమే మేలు. దీనివల్ల ఉత్పత్తి అయ్యే వేడి జుట్టుకు హాని చేస్తుంది. దాని వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇక తలస్నానం కోసం ఉపయోగించే షాంపుల విషయానికి వస్తే రసాయనాలు ఉన్న వాటిని కాకుండా వీలైనంత వరకు సహజ సిద్దమైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం.
Also Read: Snoring Remedies : గురక సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటించండి!
షాంపుతో పాటు కండిషర్ కూడా ఉపయోగిస్తే జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బయట నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యకరమైన జుట్టు కోసం పౌష్టికాహారం తప్పనిసరి. అంతేకాకుండా ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకండి. అన్నీ జాగ్రత్తలూ తీసుకుంటున్నప్పటికీ జుట్టురాలే సమస్య తగ్గకపోతుంటే మీరు ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించడం మంచిది.