‘ప్రేమ వివాహం’ మరో యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిపై యువతి సోదరుడు కత్తులతో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్‌లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న లాలాపేట పోలీసులు.. మృతదేహంను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
Also Read: Heavy Rains Today: రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక!
విద్యుత్ శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తోన్న కుర్రా గణేశ్ అనే యువకుడు కొలకలూరుకి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరవాత రక్షణ కోరుతూ గుంటూరులోని నల్లపాడు పోలీసులను గణేశ్ ఆశ్రయించాడు. దాంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడారు. తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడని గణేశ్‌పై యువతి సోదరుడు కక్ష పెంచుకున్నాడు. అంతా సద్దుమణిగిందని అనుకునే లోపే యువతి సోదరుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి కత్తులతో గణేశ్‌పై దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనతో గణేశ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.