గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీని ఇరికించేందుకు కుట్ర పన్నినట్లుగా గుజరాత్ పోలీసులు పేర్కొన్నారు. 2002లో గుజరాత్ అల్లర్లకు నరేంద్ర మోదీ కారణం అని ఆయన్ను ఈ కేసులో ఇరికించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ పనిచేశారని చెబుతూ.. ఆమె బెయిల్ పిటిషన్ ను శుక్రవారం గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు.
కాంగ్రెస్ దివంగత నేత, సోనియాగాంధీ సలహాదారు గా ఉన్న అహ్మద్ పటేల్ పన్నిన కుట్రలో తీస్తా సెతల్వాడ్ భాగమయ్యారని గుజరాత్ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరోపించింది. అహ్మద్ పటేల్ సూచనల మేరకే ఈ కుట్ర జరిగిందని.. 2002 గోద్రా అల్లర్ల తరువాత ఏర్పడిన మతకలహాల్లో మోదీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ తీస్తా సెతల్వాడ్ ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో తీస్తా సెతల్వాడ్, అహ్మద్ పటేల్ నుంచి రూ. 30 లక్షలు తీసుకున్నట్లు ఆరోపించారు పోలీసులు. ఈ పెద్ద కుట్రలో తీస్తా సెతల్వాడ్, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిందని.. అమాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రయోజనాలు పొందిందని..తీస్తా సెతల్వాడ్ కు వ్యతిరేకంగా అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో సిట్ అఫిడవిట్ దాఖలు చేసింది.
Read Also: KA Paul: ఢిల్లీలో కేఏ పాల్ మౌనదీక్ష.. ఆగస్టు 15 తర్వాత ఆమరణ దీక్ష..
2002 గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాధారాల రూపొందించాడనే ఆరోపణలపై మాజీ డీజీపీ ఆర్ బీ శ్రీకుమార్ కూడా సిట్ అరెస్ట్ చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో బీజేపీ సీనియర్ నాయకుల పేర్లు ఇరికించేందుకు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలను తీస్తాసెతల్వాడ్ కలిసేదని పోలీసులు అఫిడవిట్ లో ఆరోపించారు. సెతల్వాడ్ కు ఇప్పడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిట్ కోర్టుకు వెల్లడించింది. అదనపు సెషన్స్ న్యాయమూర్తి డీడీ టక్కర్ సిట్ వాదనలు విన్నారు. బెయిల్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు. గత నెలలో గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎం నరేంద్ర మోదీకి ఇతరులకు సుప్రీం కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కుట్ర కోణం కింద తీస్తా సెతల్వాడ్ ను అరెస్ట్ చేశారు. ఆమెపై ఫోర్జరీ..ఉరిశిక్ష విధించే ఉద్దేశంతో తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం వంటి నేరాలను నమోదు చేశారు గుజరాత్ పోలీసులు