వరుస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి విజయం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. చివరకు తాము అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా అంతర్గత కలహాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పింది. ఇక ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పెర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అంత ఘోరంగా పార్టీ అపజయాలను మూటకట్టుకుంది.
కాగా… ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉండబోతున్నాయి. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే గుజరాత్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంగళవారం గుజరాత్ లో పర్యటించారు రాహుల్ గాంధీ. అయితే అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే గుజరాత్ కాంగ్రెస్ లో కూడా లుకలుకలు కనిపిస్తున్నాయి. పాటిదార్ ఉద్యమ నాయకుడిగా హార్ధిక్ పటేల్ కు పేరుంది. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్ధిక్ పటేల్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ రాహుల్ గాంధీ కార్యక్రమంలో హార్థిక్ పటేల్ పాల్గొన్నారు. ఒకే వేదికను పంచుకున్నారు.
ఇటీవల తన ట్విట్టర్ బయో నుంచి హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ జెండా, పేరును తొలగించడంతో ఒక్కసారిగా హార్ధిక్ పటేల్ పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరుతారని చర్చ జరిగింది. గతంలో కొన్ని సందర్భాల్లో బీజేపీ పార్టీని హార్ధిక్ పటేల్ పొగడటం కూడా ఈ అనుమానాలకు తావిచ్చాయి. మరో వైపు ఢిల్లీలో పాటు ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆప్ గుజరాత్ లో పాగా వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో హార్ధిక్ పటేల్ ఆప్ లో చేరుతారంటూ వాదనలు వినిపించాయి.
ఇన్ని అనుమానాల మధ్య ఓ క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతం హార్ధిక్ పటేల్ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారనేది స్పష్టం అయింది. అయితే పలు సందర్భాల్లో… రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో తనకు ఎలాంటి సమస్యలు లేవని… కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తీరుతోనే విసిగిపోతున్నా అంటూ హార్ధిక్ పటేల్ విమర్శించారు. ఎన్నికలు మరికొన్ని నెలలు మాత్రమే ఉన్నాయని ఈసందర్భంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని పనిచేసేలా చూడాలని కోరుతున్నారు. 1998 నుంచి వరసగా గుజరాత్ లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ సారి హార్ధిక్ పటేల్, జిగ్నేష్ మేవాని వంటి వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.