Who Is Shashank Singh: ఐపీఎల్ నుంచి మరో టాలెంటడ్ బ్యాటర్ ప్రపంచ క్రికెట్‌కు పరిచయమయ్యాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఓడిపోయే మ్యాచ్‌లో చెలరేగి.. తన జట్టుకు విజయం సాధించిపెట్టాడు. అతడు మరెవరో కాదు.. ‘శశాంక్ సింగ్’. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
200 పరుగుల ఛేదనలో శిఖర్ ధావన్ (1), సామ్ కరణ్ (5), సికిందర్ రజా (15) వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట శశాంక్ సింగ్ సత్తాచాటాడు. పంజాబ్ కింగ్స్‌కు ఓటమి తప్పదనుకున్న వేళ.. శశాంక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్‌ను శశాంక్ ఆదుకున్నాడు. ఓ వైపుపు వికెట్స్ పడుతున్నా.. ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించాడు. పంజాబ్ హీరో అయిన శశాంక్ ఎవరని నెటిజెన్స్ గూగుల్ చేస్తున్నారు.
1991 నవంబర్ 21న ముంబైలో శశాంక్ సింగ్ జన్మించాడు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శశాంక్.. 1072 పరుగులు చేశాడు. అంతకుముందు 2015-16 విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్-ఏ క్రికెట్లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. లిస్ట్-ఏ కెరీర్‌లో 30 మ్యాచ్‌లు ఆడి 275 పరుగులు చేశాడు. అదే ఏడాదిలో సయ్యద్ ముస్తాక్ అలీతో ముంబై తరపున టీ20 డెబ్యూ చేశాడు. టీ20ల్లో శశాంక్‌కు మంచి రికార్డు ఉంది. ఇన్నింగ్స్ చివరలో మెరుపులు మెరిపించడం శశాంక్ స్పెషాలిటీ. ఇప్పటివరకు 58 టీ20లు ఆడి 754 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 60 వికెట్లు కూడా పడగొట్టాడు.
ఐపీఎల్ 2017లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ శశాంక్ సింగ్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అతడికి ఆడే అవకాశం రాలేదు. 2019, 2020 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తీసుకున్నా.. డెబ్యూ ఛాన్స్ రాలేదు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. ఆ సీజన్‌లో చెన్నైపై ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2023 వేలంలో అతడిని సన్‌రైజర్స్ వదిలేసింది. 2023లో శశాంక్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2024 వేలంలో ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో.. పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా పొరపడ్డారు. 19 ఏళ్ల బ్యాటర్‌కు బదులుగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శశాంక్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేశారు. శశాంక్‌ను సొంతం చేసుకున్న అనంతరం పంజాబ్ మేనేజ్‌మెంట్ తమ పొరపాటును గ్రహించింది. అయితే పరువు పోకుండా శశాంక్ తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాడని కవర్ చేసింది.
Also Read: Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరంటే?
వేలం సమయంలో ప్రీతి జింటా పొరపాటు చేసినా.. ఇప్పుడు అదే ఆ జట్టుకు వరంలా మారింది. వద్దనుకున్న శశాంక్ సింగే.. రెండు మ్యాచులలో చెలరేగాడు. ఐపీయల్ 2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసేందుకు శశాంక్ సాయపడ్డాడు. ఆర్‌సీబీ పేసర్ అల్జారీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాది 20 పరుగులు పిండుకున్నాడు. శశాంక్ హిట్టింగ్‌తో పంజాబ్ పోరాడే స్కోర్ చేసింది. తాజాగా గుజరాత్ టైటాన్స్‌పై సంచలన ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు.