గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా తూర్పు నియోజక వర్గంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి టచ్‌లో వున్నారు. వీరంతా సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వచ్చే మే నాటికి మేయర్ గుండు సుధారాణి పదవీకాలం మూడేళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో తన పదవిని పదిలం చేసుకోవడానికి మేయర్ సైతం కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతుంది. కార్పొరేటర్లు పెద్ద మొత్తంలో కాంగ్రెస్‌లో చేరిపోవడంతో పదవీ గండం తప్పదనేది ఆమెకు స్పష్టమయ్యింది. దీంతో మేయర్ సుధారాణి అడుగులు కూడా కాంగ్రెస్ వైపు పడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అత్యంత వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ కార్పొ రేషన్లు, మున్సిపాల్టీలలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా మున్సి పాల్టీలలో అవిశ్వాత తీర్మానాలను ప్రవేశపెట్టి చైర్మన్‌లను దింపేయడం కొనసాగుతుంది. గ్రేటర్ వరంగల్‌లో సైతం ఇందుకు రంగం సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకరఫ్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లను ఆదివారం సాయంత్రానికే హైదరాబాద్ చేర్చడానికి రంగం సిద్ధమైంది. వీరంతా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Also Read: Minister Seethakka: రాత్రివేళ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి సీతక్క.. విద్యార్థులతో ముచ్చట్లు!
వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని 12వ డివిజన్ కార్పొరేటర్ కావేటి కవిత, 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి, 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు, 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, 21వ డివిజన్ కార్పొరేటర్ గపూర్ ఖాన్, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి, 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్, 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన, 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, 38వ డివిజన్ కార్పొరేటర్ భైరబోయిన ఉమా దామోదర్, 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు, 41వ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మ కాంగ్రెస్‌లో చేరనున్నారు.