ఏపీలో గృహ,వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఎటువంటి అదనపు ఛార్జీల భారం మోపరాదని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రతిపాదించాయి. దీంతో ప్రస్తుతం వసూలు చేస్తున్న కరెంట్ టారిఫ్ లే, ఇక ముందు అమలులో ఉంటాయని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజలపై బిల్లుల బాదుడు లేకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించిందనే అభిప్రాయం ఉంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విద్యుత్ ఛార్జీల పెంచడం ద్వారా ఎదురయ్యే వ్యతిరేకతను, ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టే కనిపించింది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఆర్ధిక నష్టాలను ఎదుర్కొంటున్న ప్పటికీ బిల్లుల భారం గృహ,వ్యవసాయ వినియోగదారులపై మోపరాదని నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి టారిఫ్ లు పెంచే ఆలోచన లేదని డిస్కంలు రెగ్యులేటరీ కమిషన్ కు నివేదించాయి. వార్షిక అవసరాలు, రిటైల్ ధరలు, విద్యుత్ చార్జీల పెంపు తదితర అంశాలపై విశాఖలోని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ-APEPDCL ప్రధాన కార్యాలయంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారం భమైంది. వర్చువల్ విధానంలో మూడు రోజుల పాటు ఈ పబ్లిక్ హియరింగ్ జరగనుంది. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి, కమిషన్ సభ్యులు వివిధ వర్గాల నుంచి వస్తున్న సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.
Read Also: Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట
APEPDCL, APSPDCL, APCPDCL పరిధిలో ఉన్న రైతు సంఘాలు, రాజకీయపార్టీల నేతలు, ఎన్‌జీవోలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఈఆర్‌సీకి చెబుతున్నారు. తొలి రోజున 15 మంది తమ అభిప్రాయాల్ని ఏపీఈఆర్‌సీకి తెలిపారు. విద్యుత్ టారిఫ్‌ల మార్పులపై అన్ని వర్గాల అభిప్రాయాల్ని తీసుకొని త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. ఏ డిస్కంలు కూడా.. సామాన్యులపై భారం మోపేందుకు అంగీకరించక పోవడం శుభపరిణామమన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై 2023, 24 ఆర్థిక సంవత్సరంలో భారం ఉండబోదని కమిషన్ చైర్మన్ తెలిపారు. డిస్కంలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో, రాజకీయ ఆరోపణలన్నీ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ నాగార్జునరెడ్డి కొట్టి పారేశారు.
అయితే, ట్రూ ఆప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లు సహా వివిధ ఒప్పందాలను రద్దు చెయ్యాలని వామపక్ష పార్టీలు అందోళనబాట పట్టాయి. విశాఖలోని APERC పబ్లిక్ హియరింగ్ జరుగుతున్న EPDCLను వామపక్షాలు ముట్టడించాయి. ఏపీఈఆర్సీ ఎదుట డిస్కంలు కొన్ని ప్రతిపాదనలు చేశాయి. హెటీ-3 కేటగిరీలో ఉన్న ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కేటగిరిలో మార్పులు కోరాయి..ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు రాయితీలు కొనసాగిస్తూ.. డిమాండ్ చార్జీలు, టైమ్ ఆఫ్ ది డే, కనీస చార్జీల పెంపు అంశాల్లో మార్పులు సూచించాయి. మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాల్ని నిరభ్యంతరంగా చెప్పేందుకు, APERC అవకాశం కల్పించింది.