కుమార్తె వేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపంతో ఆమె తల్లి, అవ్వ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపై ఉరేసుకొన్న విషాధ ఘటన తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేరే వ్యక్తితో వెళ్లిపోయిన మహిళ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా ఓట్టన్‌సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టికి చెందిన పవిత్ర (27)కు తొమ్మిదేళ్ల కిందట రాజేష్ అనే వ్యక్తితో వివాహామైంది. రాజేష్, పవిత్రలకు ఇద్దరు కుమార్తెలు లిథిక్సా (8), దీపికా (5) ఉన్నారు. దంపతుల మధ్య గొడవల కారణంగా పవిత్ర పుట్టింటికి వచ్చేసింది. కొద్ది నెలలుగా పవిత్ర తన కుమార్తెలతో చిన్నకులిప్పట్టిలోని తల్లి కాళీశ్వరి (47) ఇంట్లో ఉంటోంది. మంగళవారం బయటకెళ్లిన పవిత్ర.. ఎంతసేపటికీ తిరిగి రాలేదు.
Also Read: Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు!
పవిత్ర కోసం కాళీశ్వరి, ఆమె తల్లి చెల్లమ్మాల్ (65) ఇద్దరు వెతికినా ఫలితం లేదు. పవిత్ర వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కాళీశ్వరి, ఆమె తల్లి తెలుసుకున్నారు. మనస్తాపం చెందిన కాళీశ్వరి.. తన తల్లి చెల్లమ్మాల్‌తో కలిసి మనవరాళ్లు లిథిక్సా, దీపికాను ఉరివేసి చంపేశారు. ఆపై వారిద్దరు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు.