Ratha Saptami 2025: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించి మూడు రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజున 5,000 మందితో సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, అనేకమంది విద్యార్థులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నగర వీధుల్లో నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు కన్నుల పండుగగా మారింది. తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, ప్రముఖ దేవస్థానాల నుంచి తీసుకొచ్చిన ఆలయ రథాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Tirupati Election: డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ.. క్యాంప్ రాజకీయాలతో రసవత్తర పరిణామాలు
రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు వినోదం, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా హెలికాప్టర్ రైడింగ్, గ్రామీణ క్రీడాపోటీలను నిర్వహించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కర్రసాము ప్రదర్శించి ఉత్సాహం పెంచగా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈసారి రథసప్తమి వేడుకలు రాష్ట్రపండుగగా గుర్తించడంతో భక్తుల సందడి విపరీతంగా పెరిగింది. ముందుచూపుతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భక్తుల్లో ఆనందాన్ని నింపిందని స్థానికులు, ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.