తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన అశ్వరావుపేట నెహ్రూ నగర్‌లో చోటు చేసుకుంది.
అశ్వరావుపేట నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో అక్కడ కాసేపు పోలింగ్ ఆగిపోయింది. అధికారులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీ కృష్ణ కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. విషయం తెలిసిన మృతుడి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.