Telangana: గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రేపు ఏసీబీకి సీఎస్ లేఖ రాయనున్నారు. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్‌ను కేబినెట్ ఆదేశించింది. ఈ రేసింగ్ ఏజెన్సీ, నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ-ఫార్ములా రేసు కేసులో మంత్రి కేటీఆర్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు విచారించేందుకు రాష్ట్ర సర్కారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అనుమతి కోరుతూ లేఖ రాయగా.. గవర్నర్ ఆమోదం తెలిపారు. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. ఏసీబీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ-ఫార్ములా కారు రేసు నిర్వహణకు సంబంధించిన రూ.55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
Read Also: TG Cabinet: భూమిలేనివారికి రూ.6 వేలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే గవర్నర్ నుంచి రాష్ట్ర సర్కారు అనుమతి కోరింది. కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు పదేపదే చేసిన విజ్ఞప్తి చేశారు. అయితే న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ ఇప్పుడు గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై తన దర్యాప్తును కొనసాగించవచ్చు. ఇందులో కేటీఆర్‌తో పాటు అప్పుడు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.