CM Revanth Reddy: పండగరోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కాపాడిన సంఘటనగా ఓ ఉదంతం రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం వాసి హేమంత్ (22) అనే యువకుడు గత నెల 29న షిరిడి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు హేమంత్‌ను అడ్మిట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు హేమంత్‌ను ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సెలవు రోజు అయినప్పటికీ జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే పరీక్షలు నిర్వహించి పేగులో రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు. అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి వ్యర్థ పదార్థాలను తొలగించి, పేగులో రంధ్రాన్ని ట్రీట్ చేశారు. పది రోజులు చికిత్స అనంతరం హేమంత్‌ను డిశ్చార్జ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల ఖర్చుతో జరిగే చికిత్సను ఉచితంగా చేసి, ప్రాణాలను కాపాడిన ఉస్మానియా వైద్యులపై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని, వాటిని ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ రంగా అజ్మీరా సూచించారు.
ఈ విషయమై జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన.. నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అన్న నానుడిని తిరగ రాసి… ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలచుకుంటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేసి… ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్క వైద్యుడు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని తెలుపుతూ.. వారికి నా ప్రత్యేక అభినందనలు అంటూ రాసుకొచ్చారు.