Liquor Payments: తెలంగాణ సర్కార్‌కి గ్లోబల్ లిక్కర్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన డియాజియో, పెర్నోడ్ రికార్డ్, కార్ల్స్‌బర్గ్ వంటి మద్యం కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం తమకు దాదాపు 466 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,800 కోట్లు) బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ వారంలో, ప్రముఖ బీర్ తయారీ సంస్థ అయిన హైనెకెన్.. తమ అనుబంధ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ ద్వారా తెలంగాణకు బీరు సరఫరాను నిలిపివేసింది. ఈ విషయం ఖరీదైన మందుబాబులకు చేదు వార్తే. ఇక దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపుల్లో జాప్యం చేయడమే కాకుండా, 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ధరల పెంపునకు కూడా అనుమతించకపోవడమే.
Also Read: CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు..
ప్రపంచంలోనే ఎనిమిదవ అతిపెద్ద మద్యం మార్కెట్ భారతదేశం. 2022 నాటి యూరోమానిటర్ నివేదిక ప్రకారం ఇక్కడ ఏకంగా 45 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం ఉంది. అయితే, ఇక్కడ ఆల్కహాల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఎందుకంటే, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం వాటికి ముఖ్యమైన వనరు. తెలంగాణలో మద్యం కంపెనీలు తమ ఉత్పత్తులను నేరుగా దుకాణాలకు సరఫరా చేయలేవు. అవి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపోలకు మాత్రమే సరఫరా చేయాలి. ఆ తర్వాత డిపోల ద్వారానే రిటైల్ వ్యాపారులకు చేరుతుంది. దీంతో, కంపెనీలు డబ్బుల కోసం పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది.
తెలంగాణలో 70% మార్కెట్ వాటాతో బీర్ రంగంలో అగ్రగామిగా ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ చెల్లింపులు ఆలస్యం కావడంతో తమ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తమకు రూ.660 కోట్లు బకాయి ఉందని తెలిపింది. ఇక కార్ల్స్‌బర్గ్ కంపెనీకి దాదాపు రూ.40 కోట్లు, ఏబీ ఇన్ బెవ్ సంస్థకు రూ.150 కోట్లు ఇవ్వాల్సి ఉంది. విస్కీ, స్కాచ్ తయారీదారులకు ఇంకా ఎక్కువ మొత్తం బకాయిలు ఉన్నాయి. పెర్నోడ్ రికార్డ్ సంస్థ ఏకంగా రూ.1500 కోట్లు, డయాజియో రూ.1,000 కోట్లు రూపాయలు రావాల్సి ఉందని వాపోతున్నాయి.
Also Read: Sankranti ki vastunnam : సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
మద్యం పరిశ్రమ సంఘాలు ఈ ఆలస్య చెల్లింపుల వల్ల కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. అక్టోబర్ 3న తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో మొత్తం బకాయిలు 606 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయని అవి వెల్లడించాయి. అయితే, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం యునైటెడ్ బ్రూవరీస్ చర్యను ధరలు పెంచేందుకే ఆడుతున్న ‘ట్రిక్’ గా అభివర్ణించారు. ధరలు పెరిగితే వినియోగదారుల డిమాండ్ తగ్గుతుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, అన్హ్యూజర్-బుష్ ఇన్ బెవ్, పెర్నోడ్ రికార్డ్ సంస్థలపై మార్కెట్ గుత్తాధిపత్యానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది.