GHMC Delimitation: జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ అంశం న్యాయస్థానానికి చేరింది. 300 డివిజన్లకు సంబంధించిన వార్డు మ్యాప్‌లు, జనాభా వివరాలను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలు అమలైతే పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై తాత్కాలికంగా స్పందిస్తూ, మొత్తం 300 వార్డుల వివరాలు కాకుండా.. పిటిషన్ దాఖలు చేసిన వార్డులకు సంబంధించిన సమాచారం మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ఆదేశించింది. ఇందులో 104వ, 134వ వార్డుల డీలిమిటేషన్ మ్యాప్‌లు, జనాభా వివరాలను మాత్రమే వెల్లడించాలని స్పష్టం చేసింది.
READ MORE: Putin: పుతిన్ సమక్షంలోనే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ 300 వార్డుల పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులు ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తదుపరి విచారణలో సింగిల్ బెంచ్ తీర్పుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.