కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు చేదువార్తను అందించాయి. ఎవరైనా కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలి. అలాగే రెగ్యులేటర్‌కు కూడా డబ్బులు చెల్లించాలి. అయితే తాజాగా గ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచేశాయి. గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ ధర ఇప్పటివరకు రూ.1,450 ఉండగా.. దానిని రూ.2,200కి పెంచుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు ప్రకటించాయి. ఐదు కేజీల సిలిండర్‌పై డిపాజిట్ మొత్తాన్ని రూ.800 నుంచి రూ.1,150కి పెంచుతున్నట్లు తెలిపాయి.
గ్యాస్ కంపెనీల తాజా నిర్ణయంతో 14.2 కేజీల సిలిండర్ కనెక్షన్‌పై డిపాజిట్ ధర ఒకేసారి రూ.750 పెరిగింది. 5 కేజీల సిలిండర్‌పై డిపాజిట్ రూ.350 మేర పెరిగింది. మరోవైపు సిలిండర్ రెగ్యులేటర్ ఛార్జీని కూడా ఒకేసారి రూ.100 పెంచాయి. రెగ్యులేటర్ ధర ప్రస్తుతం రూ.150 ఉండగా.. దానిని రూ.250కి పెంచుతున్నట్లు గ్యాస్ కంపెనీలు వెల్లడించాయి. పెంచిన ధరలు జూన్ 16 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. అయితే ఉజ్వల యోజన పథకం కింద ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొందే వారికి మాత్రం ఈ ధరల పెంపు వర్తించదని గ్యాస్ కంపెనీలు పేర్కొన్నాయి. కాగా హైదరాబాద్‌లో ప్రస్తుతం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,055గా ఉండగా విజయవాడలో రూ.1026.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.2425.50గా ఉండగా, విజయవాడలో 2363.50గా నమోదైంది.