టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ తీపికబురు చెప్పారు. అయితే.. ఎన్నో రోజుల నుంచి నష్టాల్లో మునిగిపోయిన ఆర్టీసీని లాభాల బాటలో పయనించేందుకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఉద్యోగులు ఎంతో కృషి చేశారు. వినూత్న రీతిలో ప్రజలను ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ క్రమంలోనే.. తాజాగా బాజిరెడ్డి గోవర్థన్, వీసీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఆర్టీసీ ఆశాజనకంగా నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. దసరా నేపథ్యంలో ఫెస్టివల్ అడ్వాన్స్ 20 కోట్లు ఇస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. సకల జనుల సమ్మె కాలం పెండింగ్ వేతనాలు 20 కోట్లు ఇవ్వనున్నట్లు, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో 3 డీఏలు 5 కోట్లు చెల్లిస్తామని తెలిపారు.
Also Read : Minister KTR : ఇది చేతల ప్రభుత్వం… చేనేతల ప్రభుత్వం
వీటితో పాటు.. పీఆర్సీ, యూనియన్ల పునరుద్ధరణ అంశాలు సీఎం పరిశీలనలో ఉన్నాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా పీఆర్సీ అంశంపై ఈసీకి లేఖ రాస్తున్నామన్నారు. పదవీ విరమణ చేసిన కార్మికుల అర్జిత సెలవుల వేతనం 20 కోట్లు ఇస్తామని, ఈ చెల్లింపుల వల్ల సంస్థపై 100 కోట్లు అదనపు భారం పడుతుందని ఆయన వివరించారు. డిసెంబరు చివరికల్లా 1,150 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయని, ఇప్పుడు రోజుకు సగటున 15 కోట్లు ఆదాయం లభిస్తుందని, నష్టాలు పూడ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని ఆయన తెలిపారు.