Four Years of CM YS Jagan Rule: సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయాన్ని అందుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తి చేసుకున్నాడు.. ఏపీలో 2019 ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరగ్గా, మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 50 శాతానికి పైగా ఓట్లు సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలను, 25 లోక్ సభ స్థానాలకు గాను 22 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది వైఎస్ఆర్సీపీ. ఈ గెలుపు అంత తేలిగ్గా ఏమీ రాలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నా… అప్పటి రాజకీయ పరిణామాలతో సొంతగా రాజకీయ పార్టీ పెట్టి నాయకుడిగా తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తారని ఆశించినా.. అప్పుడు ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఓ వైపు కోర్టు కేసులు, మరోవైపు సుదీర్ఘ పాదయాత్ర … ఇలా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని 2019 నాటికి ప్రజా విశ్వాసాన్ని చూరగొనగలిగారు.
రాజకీయ ప్రస్థానం ఒక ఎత్తు అయితే.. ప్రజలు నమ్మి ఓటు వేసిన తర్వాత ఏ మేరకు పాలన చేయగలిగారు అన్నది మరో ఎత్తు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టకున్నారు అనేదే ఏ రాజకీయ నాయకుడికి అయినా కీలకం అవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగితేనే మరోసారి ఓట్లు అడగటానికి ప్రజల దగ్గరకు వెళ్ళే ధైర్యం చేయగలుగుతారు. లేకపోతే ప్రజలను మోసం చేశారు, మభ్య పెట్టారనే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కోణంలో చూస్తే ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మ్యానిఫ్యాస్టోలో 98.4 శాతం పూర్తి చేశాం అంటోంది అధికార వైసీపీ. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది జగన్ సర్కార్. పేదలందరికి ఇళ్లు, అమ్మ ఒడి, పెన్షన్ల పెంపు, ఫీజు రీఎమ్ బెర్స్ మెంట్, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా వంటి పలు హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానం ద్వారా ప్రత్యక్షంగా లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తమ అస్త్రంగా వినియోగించుకోనుంది.
2019లో మే లో అధికారంలోకి వచ్చిన జగన్.. పాలనా వ్యవస్థను అర్థం చేసుకుని కాస్త నిలదొక్కుకునే లోగా.. ప్రపంచం పై విరుచుకుపడిన కోవిడ్ మహమ్మారి ప్రభావం రాష్ట్రం పై కూడా పడింది. లాక్ డౌన్ లతో చాలా మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పో రోడ్డున పడితే వారిని ఆదుకోవాల్సిన అవసరం ఓ వైపు.. బలహీనమైన ఆరోగ్య రంగానికి జవసత్వాలు అందించటం మరో సవాలుగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన, స్పెషలిస్ట్ వైద్యానికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ గా ఉండేది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇదే విధానం కొనసాగింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ హాస్పటళ్లకో లేదంటే కేర్, అపోలో వంటి కార్పొరేట్ హాస్పటళ్లకో వెళ్లాల్సిన పరిస్థితే కొనసాగింది. వైద్య రంగంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఇక, 2020 మార్చి నెలలో కోవిడ్ వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ పరీక్షలు చేసే సదుపాయం కూడా లేని పరిస్థితి. శ్యాంపిల్స్ ను హైదరాబాద్ కు పంపించే వారు. అటువంటి స్థితిలో ఉన్న వైద్య, ఆరోగ్య రంగాన్ని గాడిన పెట్టేందుకు నడుంబిగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పరీక్షలు చేయటానికి ల్యాబ్ ల ఏర్పాటు, క్రమంగా కోవిడ్ పరీక్షలు చేసే సదుపాయాలను విస్తృత పరిచారు. పరీక్షలు చేస్తే కోవిడ్ ను కట్టడి చేయటానికి అవకాశం ఉంటుందన్న కారణంతో టెస్ట్, ట్రేస్, ట్రీట్ మెంట్ అనే విధానాన్ని జగన్ ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు స్థానికంగా విదేశీ ప్రయాణాలు చేసిన వారి వివరాలు, ఫీవర్ సర్వేలు వంటివి చేపట్టారు. ఒక దశలో దేశంలో అత్యధికంగా టెస్ట్ లు చేసే రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలబడింది. అంతే కాదు కోవిడ్ రోగులకు చికిత్సలోనూ ముందు వరుసలో నిలబడింది. కోవిడ్ వస్తే మెరుగైన వైద్యం కోసం బాధితులు తెలంగాణా నుంచి సైతం రాష్ట్రానికి వచ్చే విధంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురాగలిగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
కోవిడ్ తర్వాత కూడా వైద్య, ఆరోగ్యం రంగం పై ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ కొనసాగింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లే విధానానికి బ్రేక్ వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ క్రమంలో మెడికల్ హబ్ ల ప్రతిపాదన చేశారు. అంతే కాకుండా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయలని ప్రభుత్వం సంకల్పించింది. వీటిలో కొన్నింటికి కేంద్రం నుంచి అనుమతులు రాగా…కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం కొలిక్కి వచ్చింది. నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం 8,480 కోట్లు వ్యయం చేస్తోంది. మరోవైపు హాస్పటళ్లల్లో నాడు-నేడు కార్యక్రమం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయించి హాస్పటళ్లు వసతులు మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది జగన్ సర్కారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సప్ట్ ను సైతం అమల్లోకి తీసుకుని వచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ హాస్పటళ్లల్లో పని చేసే వైద్యులు గ్రామాల్లో పర్యటించి చికిత్సలు అందించటం, అవగాహన కల్పించటం వంటి కార్యక్రమాలు చేయనున్నారు. ఈ రకంగా చూస్తే జీరో నుంచి వైద్య ఆరోగ్య రంగంలో ప్రయాణం ప్రారంభించిన జగన్.. నాలుగేళ్ళల్లో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేసినట్టే..