NTV Telugu Site icon

Chinta Mohan: తెలంగాణ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశారు..

Chinta Mohan

Chinta Mohan

Chinta Mohan: ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులాలకు అతీతంగా … పేదరికాన్ని కొలమానంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీని పాతబస్తీ ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. ఏపీసిసి అధ్యక్షుడు రుద్రరాజు మంచివాడు.. నేను ఆయనను సమర్థిస్తున్నానన్నారు. కానీ మా పార్టీ నేతలే ప్రజలను ఓట్లు అడగడం లేదన్నారు. జగన్ పాలన బాగుంటుందని అనుకున్నా….కానీ ఆయన బలహీనమయ్యారని చింతా మోహన్‌ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారన్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తూ పవన్ కళ్యాణ్ తప్పు చేశారని చింతా మోహన్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినా ఇద్దరికి వచ్చేది 5 సీట్లేనన్నారు.

Also Read: Minister KTR: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓటమి తప్పదు..

ఎలక్టోరల్ బాండ్ల పేరుతో, ముడుపుల రూపంలో వచ్చిన డబ్బు ఎస్‌బీఐలో బీజేపీ ఖాతాలో ఉందని.. ఎస్బీఐలో ఉన్న 14 వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముపై సమాధానం చెప్పాలన్నారు. అంత పెద్ద మొత్తం ఎవరు ఎవరికి ఎందుకు ఇచ్చారు.. ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ అధికారం కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో, రిజర్వేషన్లను రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు.

ఓట్లు దండుకునేందుకే మోడీ అసాధ్యమైన అంశంపై హామీలిస్తున్నారన్నారు. ఓట్ల కోసం మోడీ చేస్తున్న ప్రసంగాలను ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టు పరిధిలో ఉందని.. న్యాయస్థానం నిర్ణయిస్తుందన్నారు. హైదరాబాద్‌లో మోడీ చేసిన ప్రసంగం తనకు నచ్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఏమి చేయలేదన్న మోడీ మాటలు బాధించాయన్నారు. కృష్ణా జిల్లా ఎస్సీల వల్ల గాంధీకి దక్షిణాఫ్రికాలో గుర్తింపు వచ్చిందని.. భారత్‌లో అంటరానితనం ఉందని గాంధీకి తెలిపింది ఎస్సీలేనని తెలిపారు. దేశ స్వతంత్రం, అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీ పోరాడారన్నారు. గతంలో అంటరానివారు కాంగ్రెస్ పార్టీ వల్ల దళితులు అయ్యారన్నారు. దళితుల అభ్యున్నతికి పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ పేర్కొన్నారు. 75 ఏళ్లలో రాజకీయాల్లో ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఉంది ఇందిరాగాంధీ మాత్రమేనన్నారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు.

Also Read: Minister Ambati Rambabu: చచ్చేంత వరకు సీఎం జగన్‌ వెంటే.. పార్టీ మారను..

దేశానికి మొదటి రాష్ట్రపతి విజయవాడకి చెందిన దళితుడు చక్రయ్యను చేయాలని గాంధీ భావించారని.. కానీ చక్రయ్య బ్రెయిన్ ట్యూమర్ వల్ల చనిపోవడంతో అది జరగలేదన్నారు. నెహ్రు అంబేడ్కర్‌కు మంచి సంబంధాలు ఉండేవని.. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. బీపీ, షుగర్ వల్ల అంబేద్కర్ చాలా కోపిష్టి అని.. అంబేడ్కర్‌ను రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు చిరాకు పెట్టేవారని వెల్లడించారు. విసుగు చెంది అంబేడ్కర్‌ రెండు సార్లు రాజీనామా చేసినా నెహ్రూ అంగీకరించలేదన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజీనామా పత్రాన్ని నెహ్రూ చించేశారు. ఇవన్నీ అంబేడ్కర్‌ సతీమణి స్వయంగా నాకు చెప్పారు. అధికార బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీయే ఎన్నో చేసిందన్నారు. కానీ బీజేపీ మాత్రం అదానీకి మాత్రమే బాగా చేసిందని ఆరోపించారు. రాజ్యాంగ సవరణ మోడీ వల్ల కాదు.. ఏ ప్రధాని వల్ల కాదన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క “చెమర్” కులంలోనే 80 ఉప కులాలు ఉన్నాయన్నారు. ఇంతమందికి రిజర్వేషన్లు ఏ రకంగా ఇవ్వగలుగుతారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు.

Show comments