Manmohan Singh Last Rites: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన అంతిమ యాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారత దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు వయసు 92 ఏళ్లు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం తెల్లవారుజామున మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర నేతలు, బంధువులు ఆయనకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సిక్కు సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
92 ఏళ్ల మన్మోహన్ సింగ్ వయసు కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలు అందించారు. అంతకుముందు, ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా, అలాగే పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు.