Pervez Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన స్థానిక మీడియా వెల్లడించింది. దుబాయ్‌లోని ఆస్పత్రిలో పర్వేజ్ ముషారఫ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇక, ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.
Read Also: Madhya Pradesh: దారుణం.. చేతులు వెనక్కి కట్టి.. వృద్ధురాలని చితక్కొట్టి..
మాజీ రాష్ట్రపతి లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ముషారఫ్.. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఆ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు. పాక్ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేసిన ముషారఫ్.. 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత పాక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2016 నుంచి ఆయన దుబాయిలోనే ఆశ్రయం పొందుతున్నారు.