Kseniya Alexandrova: రష్యాకు చెందిన మోడల్, మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ క్సేనియా అలెగ్జాండ్రోవా (30) దురదృష్టకర కారు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేవలం నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న ఆమె మరణం రష్యాలో మాత్రమే కాక, అంతర్జాతీయంగా కూడా తీవ్ర విషాదానికి గురిచేసింది.
జూలై 5న అలెగ్జాండ్రోవా తన భర్తతో కలిసి ర్జేవ్ నుండి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో వారి కారు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఎల్క్ (జింక జాతి జంతువు)ను ఢీకొట్టింది. ఆ ఘటనలో అలెగ్జాండ్రోవా కారులో ప్యాసింజర్ సీట్లో కూర్చుని ఉండగా, ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె భర్త “జంతువు ఒక్కసారిగా దూకింది. అది క్షణంలోనే మా కారును ఢీకొట్టింది. దానితో క్స్యూషా తలకు బలమైన గాయం అయ్యింది. ఆ తర్వాత రక్తంతో నిండిపోయింది అని కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రమాదం తర్వాత వెంటనే ఇతర వాహనదారులు, అత్యవసర సేవలు సహాయం చేసినా, తల గాయాలు అత్యంత తీవ్రంగా ఉండటంతో ఆమెను మాస్కో ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇకపోతే క్సేనియా అలెగ్జాండ్రోవా 2017లో మిస్ రష్యా పోటీలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. అదే సంవత్సరం రష్యాను ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ యూనివర్స్ పేజెంట్లో పాల్గొన్నారు. ఆమె మాస్కో పెడగాజికల్ స్టేట్ యూనివర్సిటీలో సైకాలజీ విభాగంలో పట్టభద్రురాలిగా పూర్తి చేశారు. అందంతో పాటు ప్రతిభను కలగలిపిన వ్యక్తిత్వం కారణంగా అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు.
గత మార్చి 22న ఆమె తన భర్తతో వివాహం చేసుకున్నారు. పెళ్లి వేడుకలో తీసుకున్న ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే వివాహం అయిన కొద్ది కాలానికే జరిగిన ఈ ప్రమాదం ఆమె జీవితాన్ని అకాలంగా ముగించింది.