Srinivas Goud: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో నేడు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి సాగునీటి రంగంలో చేసిన అన్యాయాలను గుర్తుచేస్తూ, వాటిని తవ్వితే పుట్టల నుంచి పాములు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు. తెలంగాణకు సాగునీటి రంగంలో కాంగ్రెస్ చేసిన పాపాలు తవ్వితే అన్ని విపత్తులుగా బయట పడతాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇకపోతే, బ్రిజేష్ ట్రిబ్యునల్ తాజా మధ్యంతర ఉత్తర్వులు ముమ్మాటికి సీఎం కేసీఆర్ విజయమని ఆయన అన్నారు. విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని, కానీ కేసీఆర్ అందుకు అంగీకరించలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే సెక్షన్ 3 ప్రకారం నీటి పంపిణీ జరగాలని కేంద్రానికి లేఖ రాశారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు.
Also Read: Ganja Smuggling: ఓయో రూంలో గంజాయి దుకాణం పెట్టిన కేటుగాళ్లు
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ను విమర్శిస్తూనే ఉంటే ప్రజలు నవ్వుకుంటారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కర్ణాటకలో ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి అవుతున్నప్పటికీ, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్న మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిజంగా ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాగునీటి హక్కులపై పెద్దగా దృష్టి పెట్టిందని, కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనున్నాయి.