Jogi Rajeev: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో రాజీవ్ ఏ2గా ఉన్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజీవ్ చెప్పారు.
Read Also: TDP: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం.. బొత్స గెలుపు ఇక లాంఛనమే!
మరోవైపు అగ్రి గోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్‌లో ఉన్నాయని, అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు. తప్పు చేస్తే ఉరేసుకుంటానని జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు.