Sunil Kumar: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండైన ఆయన పై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ ను నమోదు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారిగా సర్వీసు నిబంధనల ఉల్లంఘనతో పాటు ఆయనపై నమోదైన వివిధ అభియోగాల మేరకు ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ నమోదు చేసారు. అప్పటి సీఐడీ చీఫ్ గా 2019 అక్టోబరు 24 నుంచి 2023 జనవరి 23 తేదీ వరకూ సీఐడీ చీఫ్ గా, 2023 మార్చి 10 నుంచి 2024 జూన్ 20 తేదీ వరకూ అగ్నిమాపక శాఖ డీజీగా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించినట్టు స్పష్టమైంది. ప్రభుత్వానికి తెలీకుండా సునీల్ కుమార్ పలు మార్లు విదేశీ పర్యటనలు చేసినట్టు ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ లో పేర్కొంది ప్రభుత్వం.
2024 మార్చి 1 తేదీన జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారని ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ లో ప్రభుత్వం పేర్కొంది. 2023 సెప్టెంబరు 2 తేదీన ప్రభుత్వానికి తెలీకుండానే స్వీడన్ పర్యటనకు వెళ్లారని మరో ఛార్జ్, అలాగే వెయిటింగ్ లో ఉన్న సమయంలోనూ 2023 ఫిబ్రవరి 1 నుంచి 28 తేదీ వరకూ ప్రభుత్వానికి తెలీకుండా అమెరికా వెళ్లోచ్చారని పేర్కోంటూ మూడో ఛార్జ్, సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో 2022 డిసెంబరు 14 తేదీన జార్జియా వెళ్తానని తెలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లినట్టు తేలింది. అలాగే 2021 అక్టోబరు 2 నుంచి 8 తేదీ వరకూ ప్రభుత్వానికి తెలీకుండా యూఏఈలో పర్యటించినట్టు పీవీ సునీల్ కుమార్ పై అభియోగాలు ఉన్నాయి. 2019 డిసెంబరు 21లో అమెరికా వెళ్లేందుకు అనుమతి తీసుకుని యూకె వెళ్లినట్టు ఆరో ఆర్టికల్ ఆఫ్ చార్జ్ నమోదు చేసింది ప్రభుత్వం.
ప్రభుత్వం నమోదు చేసిన ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ లో ప్రతీ దానికి విడివిడిగా సమాధానం చెప్పాల్సిందిగా సునీల్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ అభియోగంపైనా రాతపూర్వక సమాధానం 30 రోజుల్లోగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అభియోగాల విచారణలో రాజకీయ ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తే అఖిలభారత సర్వీసు నిబంధనల ప్రకారం చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.