తన ఎద్దు మూత్రం పోసినందుకు వంద రూపాయలు ఫైన్ చెల్లించిన వింత అనుభవం ఓ నిరుపేద రైతుకు ఎదురయింది. ఈ సంఘటన ఇల్లందు పట్టణంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిలో బాడుగలు తోలుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి ఇసుక తోలుకుంటూ నాలుగు పైసలు సంపాదిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే వృత్తిగా భావిస్తూ ఎద్దుల పోషణ చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జీఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో జీఎం కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసిందని జీఎం కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : Bomb Blast: పశ్చిమ బెంగాల్లో ఘోరం.. టీఎంసీ నేత ఇంట్లో బాంబు పేలుడు
పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. బాడుగలు తోలుకొని జీవించే ఎద్దుల బండిని పోషించే కష్టమవుతున్న తరుణంలో ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటని సుందర్‌లాల్, బాధపడుతూ స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో 100 రూపాయలు ఫైన్ చెల్లించి రసీదు తీసుకున్నాడు. సింగరేణి అధికారులు కేసు పెట్టి ఆందోళన గురి చేశారని సుందర్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తన 40 ఎకరాల భూమిని సింగరేణి ఓసి కింద కోల్పోయానని తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్నాడు.
ఇటీవల ముఖ్యమంత్రిని కలవడానికి ఇల్లందు నుండే హైదరాబాదుకు పాదయాత్ర నిర్వహించాడు. పోలీసులు అడ్డుకోవడంతో కలవలేకపోయాడు. తన కొడుకు టూ వీలర్ మీద ఢిల్లీ వరకు వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చాడు. అయినా సుందర్‌లాల్‌కు నష్టపరిహారం సింగరేణి యజమానం ఇవ్వడం లేదు. వాళ్ళ కుటుంబంలో ఆ భూమికి సంబంధించిన నష్ట పరిహారం చెల్లించామని చెప్తుంది సింగరేణి యాజమాన్యం. చెల్లించలేదని సుందర్‌లాల్ ఆందోళన కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుందర్‌లాల్‌పై ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడం చర్చనీయాంశమైంది.