interim Budget: లోక్ సభ ఎన్నికల ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల మధ్య.. 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టనుంది. అయితే, ఇది పూర్తిస్థాయి పద్దు మాత్రం కాదు.. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.
Read Also: GST Collection : బడ్జెట్‌కు ముందు ప్రభుత్వానికి శుభవార్త.. జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల
సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లో విధాన పరమైన కీలక నిర్ణయాలు ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ సర్కార్ ఉవ్విళ్లూరుతుంది. అందులో భాగాంగానే.. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో- 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న లక్ష్యాన్ని విస్మరించకుండా.. మౌలిక వసతుల కల్పనపై మూలధన వ్యయం పెంపు ద్వారా భారతదేశ ప్రగతికి మరింత మెరుగైన బాటలు వేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక, బడ్జెట్‌ను వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుంది. మోడీ ప్రభుత్వం-2కు ఇవే చివరి బడ్జెట్. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేస్తూ.. ఇకపై దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటునేది సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించే ఛాన్స్ ఉంది.