Paris Olympics 2024: ఒలింపిక్స్ పాల్గొంటే చాలని క్రీడాకారులంతా కలలు కంటూ ఉంటారు. పతకం గెలవకపోయినా ఈ క్రీడల్లో పాల్గొంటే చాలని అహర్నశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఈజిప్ట్‌కి చెందిన ఫెన్సర్ నాడా హఫీజ్(26), 7 నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడింది.. మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఆమె, రౌండ్ 16లో పోరాడి ఓడింది. ఈ ఓటమి తర్వాత తాను 7 నెలల గర్భవతిని అంటూ బయటపెట్టింది నాడా హఫీజ్.
Read Also: Nikhat Zareen: నిరాశపరిచిన నిఖత్ జరీన్.. ప్రీక్వార్టర్స్‌లో తప్పని ఓటమి
‘7 నెలల ప్రెగ్నెంట్ ఒలింపియన్! పోడియంలో ఇద్దరు ప్లేయర్లు పోటీ పడతారు, కానీ ఈసారి ముగ్గురు పోటీ పడ్డారు. నేను, నా పోటీదారుడు, ఇంకా ఈ ప్రపంచంలోకి రాని నా లిటిల్ బేబీ!.. నాతో పాటు నా బిడ్డ కూడా ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఎన్నో ఛాలెంజ్‌లు ఫేస్ చేసింది. ప్రెగ్నెన్సీ ఎంత ఆనందాన్ని తెస్తుందో అంతే కష్టాన్ని కూడా తెస్తుంది. నా వ్యక్తిగత జీవితాన్ని, క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు చాలా కష్టపడ్డాను. పతకం గెలవకలేకపోయినా ఈ ప్రయాణం నాకు సంతృప్తిని ఇచ్చింది.. 16 రౌండ్ దాకా రావడం కూడా గొప్ప విజయమే… నన్ను నమ్మిన నా భర్త ఇబ్రహీంకి, నా కుటుంబానికి థ్యాంక్స్.. మూడుసార్లు ఒలింపిక్ ఆడిన నాకు, ఈ ఒలింపిక్ మాత్రం చాలా ప్రత్యేకం! లిటిల్ ఒలింపియన్‌ని మోస్తూ ఈసారి కత్తి పట్టాను.. ’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్.
ఒలింపిక్స్ వేదికపై గర్భంతో గెలిచి మహిళలందరికీ సందేశం ఇవ్వాలని నాడా హఫీజ్ కలలు కంది. కానీ దురదృష్టవశాత్తూ హఫీజ్ 16వ రౌండ్‌లో ఓటమిని చవిచూసింది. అయితే గర్భం లేదా ప్రసవం ఒక మహిళ గెలుపుకు ఎలాంటి అడ్డంకి కాదని ఈ ఫెన్సర్ నిరూపించింది. అయితే ఈజిప్టు ఫెన్సర్ 7 నెలల గర్భవతి అయినప్పటికీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నట్లు నాడా హఫీజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసేంతవరకు ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆమె ధైర్యాన్ని, నిబద్ధతను అందరూ అభినందిస్తున్నారు.
ఈజిప్టు ఫెన్సర్ పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త రికార్డును సృష్టించింది. గర్భంతో ఉన్న నాడా హఫీజ్ తన మూడో ఒలింపిక్స్‌లో తన మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ పోటీలో 26 ఏళ్ల హఫీజ్ తన తొలి మ్యాచ్‌లో 15-13తో అమెరికాకు చెందిన ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై గెలిచింది. ఆ తర్వాత 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయాంగ్‌తో తలపడింది. అయితే ఈ రౌండ్ లో ఆమెకు ఓటమి ఎదురైంది. అయితే ఫెన్సర్ నాడా హఫీజ్ 7 నెలల గర్భంతో పోటీలో దిగడాన్ని ఈజిప్టు దేశస్థులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘7 నెలల గర్భంతో మెడల్ గెలుస్తాననే నమ్మకంతోనే ఒలింపిక్స్‌లో అడుగుపెట్టావా? గర్భవతిగా ఉంటూ ఒలింపిక్స్ ఆడాలని అనుకోవడం మంచిదే. కానీ మాకు మా దేశం గెలవడం కావాలి? నీ స్థానంలో మరో ప్లేయర్ ఆడి ఉంటే ఈజిప్టుకి పతకం వచ్చి ఉండేది.. ఒలింపిక్స్ ఉన్నాయని తెలిసి గర్భం ఎలా తెచ్చుకున్నావ్? ఒలింపిక్స్‌కి ముందు లేదా తర్వాత ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా? ఒలింపిక్స్, నీకోసం ఆడుతున్నావా? లేక దేశం కోసమా? ఫిజికల్‌గా ఫిట్‌గా లేనప్పుడు వేరే ప్లేయర్‌ని ఒలింపిక్స్‌కి పంపించవచ్చుగా..’ అంటూ నాడా హఫీజ్ ఇన్‌స్టా పోస్ట్‌పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇలా కామెంట్లు చేస్తున్న వారిలో ఎక్కువమంది ఈజిప్టు దేశస్థులే కావడం గమనార్హం.