Swapnil Kusale Shoots Bronze Medal in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. గురువారం ఛటౌరోక్స్‌లోని నేషనల్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దాంతో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండు 2 పతకాలు వచ్చిన విషయం తెలిసిందే.
తీవ్రమైన పోటీ మధ్య స్వప్నిల్ కుసాలే అసాధారణ ప్రదర్శనచేశాడు. ఫైనల్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. కాస్త నెమ్మదిగా ప్రారంభించిన స్వప్నిల్.. కీలక సమయంలో మాత్రం పుంజుకొన్నాడు. ఓ దశలో 4, 5 స్థానాల్లో కొనసాగిన అతడు టాప్-3లోకి వచ్చాక వెనక్కి తిరిగిచూడలేదు. మూడు పొజిషన్లలో జరిగిన ఈ పోటీల్లో ప్రోన్ (బోర్లా పడుకొని), నీలింగ్ (మోకాళ్ల మీద), స్టాండింగ్ (నిల్చొని) షూటింగ్ చేయాలి. మోకాళ్లపై 153.5 పాయింట్లు, ప్రోన్‌లో 156.8 పాయింట్లు, స్టాండింగ్‌లో 141.1 పాయింట్లను సాధించాడు.
ఇక చైనాకు చెందిన లి యుకున్ (463.6) స్వర్ణ పతకం, ఉక్రెయిన్ షూటర్ కులిష్ సెర్హియ్ (461.3) రజత పతకం కైవసం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్‌గా స్వప్నిల్ నిలిచాడు. ఒకే ఎడిషన్‌లో భారత షూటింగ్ బృందం మూడు పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఏ ఒలింపిక్స్‌లోనూ షూటింగ్ బృందం ఇంతలా చెలరేగలేదు.