తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిపిపోయింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసి చేతికందిన వరిపంట నేలపాలైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Azam Khan: అతిక్ అహ్మద్ లాగే నన్ను చంపుతారని భయమేస్తోంది..
అకాల వర్షాలు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పడి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్న నీటి పాలైంది. రాష్ట్రంలోని వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట పట్టణాల్లోని మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ప్రస్తుతం వాతావరణం మార్పులతో కర్షకులు బోరున విలపిస్తున్నారు. మళ్లీ వర్షం పడే అవకాశం ఉండడంతో రైతన్న భయపడిపోతున్నాడు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లే తాము నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు.
Also Read : Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు లీజుకిస్తున్నారు?
మామిడి రైతుల తోటల్లోని మామిడి కాయలు నేలరాలడంతో తీవ్రంగా నష్టపోయారు. రైతులు తమ ధాన్యాన్ని చూస్తూ రోదిస్తున్నారు. కొన్ని గ్రామాలల్లో వరికోయకుండానే పంటచేలోని వరిధాన్యం వడగండ్ల వానకు పూర్తిగా నేలపమట్టమైంది. దీంతో చేతికి వచ్చిన పంట పనికి రాని పరిస్థితిలోకి వచ్చిందని రైతులు కంటతడిపెడుతున్నారు. అకాల వర్షాలతో పాటు, వడగండ్ల వాన దెబ్బకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Also Read : Errabelli Dayakar Rao: కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయండి
అయితే మరో వైపు వాతావరణ శాఖ రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం విదర్భ నుంచి కొనసాగుతుంది. ఈ ప్రభావం తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.