Azam Khan: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ లో సివిల్ పోల్స్ ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తనకు భయమేస్తోందని, తనను కూడా అతిక్ అహ్మద్ లాగే కాల్చి చంపుతారని భయపడుతున్నానని అన్నారు. నా నుంచి, మా పిల్లల నుంచి మీకు ఏం కావాలి..? ఎవరైనా వచ్చి మమ్మల్ని తలపై కాల్చాలని అనుకుంటున్నారా..? నిజామ్-ఈ-హింద్, చట్టాన్ని కాపాడండి అంటూ కామెంట్స్ చేశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆజాంఖాన్ చాలా కాలం తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Read Also: Kodali Nani: రజనీకాంత్ జీరో..! సూపర్ స్టార్‌పై కొడాలి నాని ఫైర్..
‘‘మేము మా ఓటు వేస్తాం, ఇది మా జన్మ హక్కు, కానీ అది మా నుంచి రెండు సార్లు లాగేసుకున్నారని, మూడోసారి లాక్కుంటే మీరు ఊపిరి పీల్చుకునే హక్కు కూడా ఉండదు’’ అని తనను విద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన కేసులో మూడేళ్ల జైలు శిక్ష విధించడం, ఎంపీ పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించడంపై ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల ర్యాలీలో రాంపూర్ అధికారులపై , ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆజాంఖాన్ పై కేసు నమోదు అయింది.
రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ నేత ఫాతిమా జాబీ తరుపున ఆజాంఖాన్ ప్రచారం చేశారు. దేశంలో ఆర్మీ తప్పా, పోర్టులు, విమానాశ్రయాలు, ఎర్రకోటను, రైల్వేలను అమ్మేశారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో రాంపూర్ అసెంబ్లీ స్థానం గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారని, ఇది మీ బలం అని ప్రజలతో అన్నారు.