దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతల తెలంగాణలో రెండో రోజు పర్యటన ముగిసింది. అయితే.. ఈ రైతు సంఘాల నేతలతో శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. ప్రగతి భవన్ లో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు అనంతరం రైతు సంఘాల నేతల మాట్లాడుతూ.. జాతీయ రైతు ఐక్యవేదిక ఏర్పాటు కావాలని జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశం తీర్మానం చేసినట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయం, రైతు సంక్షేమ విధానాలు అమలు కోసం ఐక్య వేదిక ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను సమావేశంలో తీవ్రంగా ఖండించినట్లు.. దేశ రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సమావేశంలో చర్చించినట్లు వారు తెలిపారు. దేశంలో అసంఘటితంగా ఉన్న రైతాంగం మొత్తం సంఘటితం కావాల్సిన సందర్భం వచ్చిందని, భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ దేశాల చట్టాలను, పాలనా వ్యవస్థలను రూపొందించుకుంటుందని, తమ ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో సర్వానుమతి తీసుకొని పాలనను ప్రారంభిస్తారన్నారు. వ్యవసాయ రంగాన్ని గుణాత్మకంగా ప్రగతిపథాన నడిపించేందుకు ఐక్య సంఘటన కట్టవలసి ఉందని, అందుకు దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు చేస్తున్న మీరంతా ముందు వరసరలో ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ వ్యవసాయ విధానాలు అవలంభించాలని సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నేతలందరూ కోరారని, ఒక ముఖ్యమంత్రి రైతు నాయకుల కోసం ఇంత సమయమివ్వడం దేశంలో ఇదే తొలిసారి అని రైతు సంఘాల నేతలు అన్నారు.
రైతు వ్యవసాయ సమస్యలపై చర్చ జరిగింది. దానికి పరిష్కార మార్గాల మీద రైతు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ తో విస్తృతంగా చర్చించారు. దేశంలోని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రైతును ఐక్యం చేసే విధంగా ఐక్య రైతు సంఘటన ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నేతలు ముక్త కంఠంతో కోరారు. జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని నిజం చేయాలని, రక్షణ, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వ మద్దతు లేకుంటే ఆ దేశం, ఆ రాష్ట్రం వెనుకంజ వేస్తుందని రైతు నేతలు తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. రైతు సంక్షేమం దిశగా దేశంలో సరైన వ్యవసాయ విధానాలను రూపొందించి అమలు చేసినపుడే దేశం, ప్రజలు సరిగా బాగుపడతారని సమావేశం అభిప్రాయపడింది. దేశంలోని నలుమూల నుంచీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా రైతులు రావడం గొప్ప విషయమన్నారు. నాటి తరం రైతు సంఘాల నేతలు చరణ్ సింగ్, దేవీలాల్, జయప్రకాశ్ నారాయణ్, శరద్ పవార్ తదితరులతో కలిసి పనిచేసిన 80 ఏండ్ల వయస్సు పైబడిన పలువురు రైతు నేతలు సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. నేడు శనివారం నాటి సమావేశంలో పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు వారి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న, కొనసాగుతున్న వ్యవసాయం, రైతుల పరిస్థితుల గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. శనివారం ప్రగతి భవన్ కు వచ్చిన దేశంలోని 26 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భోజనం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటూ వివిధ రాష్ట్రాల రైతులు సీఎం కేసీఆర్ ను ప్రశంసించి, వారికి శాలువాలు కప్పి, పూలదండలు వేస్తూ, చిత్రపటాలు బహుకరించి సన్మానించారు. పంజాబ్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రేమతో కరవాలం అందజేయగా, ఈశాన్య రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు పైనాపిల్స్ బహుకరించారు.