Farmers Protest: దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రేపు( ఫిబ్రవరి 16న) గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రజలకు వివరించి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే భారత్‌బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు సపోర్ట్ ఇచ్చాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులను స్తంభింపజేస్తామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.
Read Also: Sarfaraz Khan: సర్ఫరాజ్ సతీమణి భావోద్వేగం.. వీడియో వైరల్!
అయితే, తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వరుసగా మూడో రోజు కూడా రైతులు ఆందోళనకు దిగారు. నేడు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు. ఇక, రైతుల డిమాండ్లపై రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించి, నిరసనను విరమించుకోవాలని రైతులకు సూచించారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగియడంతో.. నేడు మరోసారి చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు ఇవాళ మధ్యాహ్నం చండీగఢ్‌లో జరగనున్నాయి.