Farmers Agitation : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అన్నదాతలు రోడ్డెక్కారు. ఢిల్లీ-హరియాణా రోడ్డుపై ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నిరసనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందించకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేశారు. సోనిపట్ లోని రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీ వద్ద ఆదివారం కిసాన్ పంచాయితీ జరుగనుంది. ఈ పంచాయితీలో ఎంఎస్‌పీ గ్యారెంటీతో పాటు ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మరోసారి అన్నదాతలు డిమాండ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వారి ఆందోళనలను విరమించారు.
Read Also: Mobile Explode: గేమ్స్ ఆడుతుండగా పేలిన సెల్ ఫోన్
రైతులు తమ ఆందోళనలు విరమించి ఇవాల్టికి ఏడాది అయింది. దీనిని పురస్కరించుకుని హరియాణా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన అన్నదాతలు బహదూర్‌ఘర్ పట్టణం నుంచి తిక్రీ సరిహద్దుకు ‘మషాల్ యాత్ర’ చేపట్టారు. రైతులు దేశ రాజధానిలోకి రాకుండా నిరోధించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టారు. ఈ యాత్ర కారణంగా దాదాపు గంటకు పైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేంద్రంలోని బీజేపీ పెద్దల పోకడ ఇలాగే ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని పలువురు రైతులు అంటున్నారు.