Karimnagar Farmer Uses Tiger Doll to Protect Crops from Monkeys: కోతుల బెడుదల నుంచి తన పంట పొలాలను కాపాడుకునేందుకు ఓ రైతు వినుత ఆలోచన చేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన రైతు కామెర రాజ్ కుమార్ తనకున్న ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ.. జీవనం గడుపుతున్నాడు. అయితే కోతులు రోజు వచ్చి కూరగాయల పంటను చెడగొట్టడంతో.. పలుమార్లు విసిగిపోయాడు. దాంతో రైతు రాజ్ కుమార్ ఓ వింత ఆలోచన చేశాడు.

రాజ్ కుమార్ ఓ పులి బొమ్మను తీసుకువచ్చి తన చేనులో పెట్టి.. తన పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. పులి బొమ్మను చూసిన కోతులు.. నిజంగానే పులి వచ్చిందని చేనులో నుంచి పరుగులు పెడుతున్నాయి. ఇదే అంశంపై రైతు రాజ్ కుమార్ స్పందించాడు. ‘కూరగాయలు కాసి చేతికి అందే సమయానికి కోతులు వచ్చి మొత్తం నాశనం చేస్తున్నాయి. పులి బొమ్మను పెడితే కోతుల బెడద ఉండదని సోషల్ మీడియాలో చూశా. వెంటనే పులి బొమ్మను తీసుకువచ్చి నా పొలంలో పెట్టాను. పులి బొమ్మతో పంటను కాపాడుకుంటున్నా’ అని సంతోషం వ్యక్తం చేశాడు.

రైతు కామెర రాజ్ కుమార్ చేసిన ప్రయత్నంకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్ కుమార్ ప్రయత్నంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘రైతు.. రాజ్ కుమార్ సూపర్’, ‘గ్రేట్ ఐడియా’, ‘మేము ప్రయత్నిస్తాం’ అంటూ రైతులు కామెంట్స్ చేస్తున్నారు. కోతుల బెడద ఉన్న రైతులు రాజ్ కుమార్ మాదిరి పులి బొమ్మను తెచ్చిపెట్టుకుంటే తమ పంటలను కొంతవరకైనా కాపాడుకోవచ్చు. కొన్నేళ్లుగా కోతుల బెడదతో కంది, పెసర, పల్లి, మొక్కజొన్న, పత్తి, టమాటా, బీర, దోస.. లాంటి పంటలు చాలా వరకు తగ్గాయి.
