అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న విజయవాడకు చెందిన జనార్దన్ రావు అరెస్టును శనివారం చూపకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తాం అని న్యాయవాది రవీంద్రా రెడ్డి తెలిపారు. ‘ఎక్సైజ్ పోలీసులకు లొంగిపోవటానికి జనార్దన్ రావు విదేశాల నుండి వచ్చారు. విజయవాడ వస్తున్నా అని ముందస్తు సమాచారం జనార్ధన్ పోలీసులకు ఇచ్చారు. మదనపల్లి పోలీసులకు లొంగిపోవాలని అధికారులు జనార్దన్‌కు చెప్పారు. జనార్ధన్ నుంచి బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. జనార్దన్ అరెస్టును రేపు చూపకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తాం. కేసులో ఏ4 రవిని హైదరాబాదులో నేను సరెండర్ చేయిస్తే.. ఇప్పటివరకు అరెస్టు చూపించలేదు. ఎక్సైజ్ అధికారులకు కూడా ఇందులో పాత్ర ఉంది’ అని జనార్దన్ న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: Perni Nani vs SP: సరైన పద్ధతి కాదు.. పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ సీరియస్!
జనార్దన్ రావును గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎక్సైజ్ పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి జనార్దన్ విజయవాడ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్‌ను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. విజయవాడలో ఉన్న రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారు. కల్తీ మద్యం తయారీ డంప్ లు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. కల్తీ మద్యం ఏఏ ప్రాంతాలకు సరఫరా చేసారు, లిక్కర్ సిండికేట్‌లో ఇందులో పాత్రధారుల వివరాలు తెలుసుకుంటున్నారు. ములకల చెరువులో కల్తీ మద్యం తయారీకి అండగా నిలిచిన వారి వివరాలను గురించి విచారణ చేస్తున్నారు. అధికారులు రేపు కోర్టులో హాజరుపరచనున్నారు.