నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ సామాజిక ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను వినియోగించిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు ఐదుగురు ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఘటనకు సంబంధించి జిల్లా వైధ్యారోగ్య అధికారి డాక్టర్ రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేష్ ల ఆధ్వర్యంలో విచారణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఇద్దరు ఉద్యోగులు సునీత (ఫార్మసిస్ట్), చంద్రకళ (స్టాఫ్ నర్స్) లను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ వంశీ, ఫార్మసిస్టులు శ్రీనివాస చారి, ఎం. విజయ్ కుమార్, వెంకటేష్, కళ్యాణి లకు మెమోలు జారీ చేసినట్లు తెలిపారు.
వైద్య సేవలు అందించుటలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.