ఆరోగ్య సమస్యల వల్ల తాను దుబాయ్ వెళ్లానని, కార్యకర్తలకు దూరమయ్యానని బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టొద్దని సీపీకి విన్నపం చేశానన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన కొడుకుపై కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ జరగనుంది. రజతోత్సవ సన్నాహాక సమావేశ కార్యక్రమం బోధన్ అప్న ఫంకషన్‌లో ఈరోజు జరిగింది. మాజీ ఎమ్మెల్యే షేకీల్, బీఆర్ఎస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ సన్నాహాక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. తన కొడుకుపై కక్ష సాధింపులో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రైస్ మిల్లులో రూ.7 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టొద్దని సీపీకి విన్నపం చేశా. ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్ళాను, కార్యకర్తలకు దూరమైయ్యాను’ అని తెలిపారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్‌లో ఉండగా.. తల్లి అంత్యక్రియల కోసం హైదరాబాద్ రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో షకీల్ కుమారుడు సాహిల్ కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు షకీల్ ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి.