వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో నాని ఏ6గా ఉన్నారు. ఈ ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.
బందరు మండలం పోట్లపాలెంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరుతో గోడౌన్స్ నిర్మించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యంను పక్కదారి పట్టించారని నానిపై కేసు నమోదైంది. ఆయన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. గోదాము మేనేజర్ బేతపూడి మానస్ తేజను ముందు పెట్టి.. ఈ కుట్ర అమలు చేశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు ఆమెను ఏ1గా చేర్చారు. ఏ2గా మానస్ తేజ్, ఏ3గా కోటిరెడ్డి, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజనేయులు ఉన్నారు.