Zaheer Khan Says Shreyas Iyer wasted many opportunities: సీనియర్ ప్లేయర్స్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే టెస్ట్ జట్టులో ఉండటంతో.. మొన్నటివరకూ శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియాకు ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. ఒకవేళ వచ్చినా 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాడు. సీనియర్లు ఇద్దరు ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. మిడిలార్డర్‌లో జట్టును ఆదుకుంటారని ఆశిస్తే.. వరుసగా విఫలం అయ్యారు. ఎట్టకేలకు గిల్ ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో సెంచరీ చేయగా.. శ్రేయస్ మాత్రం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు అతడిని ఎంపిక చేయడం కష్టమేనని మాజీ క్రికెటర్లు అంటున్నారు.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్ 35, 13 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 29, 27 పరుగులు చేశాడు. శుభారంభాలను శ్రేయస్ మరోసారి సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓవైపు కుర్రాడు యశస్వి జైస్వాల్ సెంచరీ, హాఫ్ సెంచరీలు బాడుతుంటే.. సీనియర్ అయిన శ్రేయస్ ఫిఫ్టీ మార్క్ కూడా అందుకోలేకపోతున్నాడు. చివరిసారిగా అతడు 2022 డిసెంబర్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. శ్రేయస్ ఫామ్‌పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫామ్ ఎంత కీలకమో శ్రేయస్ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, జట్టుతో పాటు అతడికీ ఫామ్ చాలా ముఖ్యం అని జహీర్ పేర్కొన్నాడు.
Also Read: IND vs ENG: సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్‌కు గాయం.. సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ!
‘ఫామ్ ఎంత కీలకమో శ్రేయస్ అయ్యర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జట్టుతో పాటు అతడికీ ఫామ్ చాలా ముఖ్యం. ఇప్పటికే చాలాసార్లు అవకాశాలు వచ్చాయి. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. ఒక్క పేసర్ మాత్రమే ఇంగ్లండ్ జట్టులో ఉండగా.. మిగతావారంతా స్పిన్నర్లే. కాస్త కుదురుకుని పరుగులు చేస్తే బాగుండేది. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు త్వరలో జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. శ్రేయస్‌ను జట్టులో కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై సెలక్టర్లకు ఓ క్లారిటీ ఉంది. కేఎల్ రాహుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రజత్ పటిదార్ అరంగేట్రం చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. జట్టులో ఇప్పుడు తీవ్ర పోటీ ఉంది. శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసి తన స్థానాన్ని కాపాడుకున్నాడు’ అని జహీర్ ఖాన్ అన్నాడు.