భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను లెజెండరీ ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌తో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పోల్చాడు. తన బంతులతో బ్యాటర్లను బురిడీ కొట్టించగల నైపుణ్యం బుమ్రాలో ఎక్కువగా ఉందన్నాడు. బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ వేస్తాడని, అందుకే అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుందన్నాడు. బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడలేడని, ఇంగ్లండ్ టీమ్ కూడా అదే కోరుకుంటోందని బ్రాడ్ చెప్పుకొచ్చాడు.
స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్‌తో మాట్లాడాడు. ‘జస్ప్రీత్ బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ చేస్తాడు. బుమ్రా రన్‌అప్‌ను చూస్తే 70 మైళ్ల వేగంతో బంతి విసిరేలా కనిపిస్తాడు కానీ.. ఆ బంతి 90 మైళ్ల వేగంతో దూసుకొస్తోంది. షోయబ్ అక్తర్ 100 మైళ్ల వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి.. 100 మైళ్ల వేగంతో బంతులు వేసేవాడు. బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ చేయడంతో అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుంది. గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఎంతో నియంత్రణగా బౌలింగ్ వేసేవాడు. ప్రస్తుతం బుమ్రా కూడా మెక్‌గ్రాత్ మాదిరే బంతులు వేస్తున్నాడు’ అని బ్రాడ్ పేర్కొన్నాడు.
‘జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడలేడు. ఇంగ్లండ్ టీమ్ కూడా అదే కోరుకుంటోంది. బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడితే చాలా వికెట్లను ఖాతాలో వేసుకుంటాడు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ గమనాన్నే మార్చే గల బౌలర్ అతడు. టీమిండియా అద్భుత బౌలర్లలో అందరికంటే బుమ్రా ముందుంటాడు’ అని స్టువర్ట్ బ్రాడ్ ప్రశంసించాడు. వర్క్ లోడ్ కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌లో మూడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే బుమ్రా ఆడనున్నాడు. ఏ టెస్టులు ఆడుతాడో ఇంకా తెలియరాలేదు. బహుశా టెస్ట్ సిరీస్ తీవ్రతను బట్టి మ్యాచ్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి.