Election Commission: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (ఎన్డీఏ) కూటమి నేతల ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇటీవల అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలం విఠలం వద్ద తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రచార రథాన్ని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ప్రమాదంలో ప్రచార రథం పూర్తిగా దగ్ధం కాగా, ప్రచార వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఎన్డీఏ కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక, ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదుతో రాయచోటి డీఎస్పీ మహబూ బాషపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
మరోవైపు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై కూడా చర్యలకు పూనుకుంది ఎన్నికల కమిషన్.. అనంతపురం డీఎస్పీ రాఘవరెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి బదిలీ చేసింది ఈసీ.. ఇక, ఎన్నికల కమిషన్ ఆదేశాలో డీజీపీ ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇద్దరు డీఎస్పీలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
కాగా, అనంతపురం టీవీ టవర్ సమీపంలో వ్యక్తిగత కారణాలతో టీడీపీ, వైసీపీ నేతలు గొవడ పడితే.. డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఉద్దేశపూర్వకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును అరెస్ట్ చేశారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని లేదా సస్పెండ్ చేయాలని ఈసీకి ఫిర్యాదు చే శారు.. మరోవైపు.. పీలేరు నియోజకవర్గలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రచార రథాన్ని తగలబెట్టారని.. ఇది దుర్మార్గపు చర్య అంటూ టీడీపీ సహా కూటమి నేతలు విమర్శిస్తున్నారు.. టీడీపీ ప్రచార రథాన్ని దగ్ధం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధం కాగా.. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఈ ఘాతుకానికి పాల్పడి పరారయ్యారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.